గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, జనవరి 2018, మంగళవారం

9వ పద్యపక్షము తెలుఁగు భాషా పరిరక్షణలో ప్రభుత్వం యొక్క పాత్ర, మన కర్తవ్యము.. రచన. చింతా రామ కృష్ణా రావు.

జైశ్రీరామ్.
9వ పద్యపక్షము
తెలుఁగు భాషా పరిరక్షణలో ప్రభుత్వం యొక్క పాత్ర, మన కర్తవ్యము..
రచన. చింతా రామ కృష్ణా రావు.
. ఆటవెలది త్రయ గర్భ సీసము.
శ్రీకరంబు తెలుఁగు. శ్రీవాణి మంజీర - నాద మంజులమగు నా తెలుంగు.
తెలుఁగు దివ్వె భువిని కొడికట్టుకొనుచుండ, - ప్రభుత కాంచకుండె భవిత కృష్ణ.
జీవభాష తెలుఁగు, చిన్మూర్తిఁ గనఁ జేయు, - ధైవభాష పోలి ధాత్రి వెలిఁగె.
భావ సుందరమగు పదసంపదల భాష. - బ్రతుకఁ జేయుమయ్య క్షితిని కృష్ణ!
.వె. ప్రభుత దృష్టి పెట్టి పాఠశాలలనుండి - తెలుఁగు వరలఁజేసి నిలుప వలయు.
జనులు మాతృభాష ఘనతను మరువక - తెలుఁగు నేర్వ భువిని వెలుఁగు కృష్ణ!
. ఆటవెలది త్రయ గర్భ సీసము.
తెలుఁగు తెనుఁగు నాంద్ర దేదీప్య నామాల - వెలుఁగె నాడు తెలుఁగు జిలుఁగులీని
తెలుఁగు వెలుగుకింక తెల్లవారుచునుండె - నాంగ్లమరయుచుంట నమల కృష్ణ!
చిత్ర కవిత, బంధ చిత్ర, గర్భకవిత, - శ్లేష కవిత తెలుఁగు హృదయమపుడు
నేడు వర్ణచయము నేర్వకుండుటఁ జేసి, - వీడిపోయె తళుకు వినుము కృష్ణ!
.వె. సద్వధాన సుగతి, సరస వాఙ్మయముతో - నలరు భాష తెలుఁగుకథమ గతియె
కలుగుచుండె. ప్రభుత కని కావఁగావలెన్, - మరచిరేని తెలుఁగు మనదు కృష్ణ!
. ఆటవెలది త్రయ గర్భ సీసము.
మనము తెలుఁగు భాష మాటలాడవలయు - సరస కావ్య తతిని చదువ వలయు.
ఘనత చాటు తెలుఁగు ఘన చిత్ర బంధముల్ - కలవటంచు తెలుపవలయు కృష్ణ!
నవ రసామృత మిది, శ్రవనసుందరమిది - నవ్య గతుల వెల్గు భవ్య భాష
అట్టి తెలుఁగు వీడుటన్యాయమేకద! - అరసి కావుమయ! యనంతకృష్ణ!
.వె. బ్రతుకు కొఱకు మనము పాశ్చాత్య దేశాల - కేగి యుండవచ్చు నెచ్చటున్న
మాతృభాష తెలుఁగు మన్ననందునటుల మేము - చేయవలయు పృథ్వి కృష్ణ!
4. కంద గీత చంపకమాల గర్భ సీసము.
మన తెనుఁగున్ సదా మహిని మన్నన లందెడి మ్రానిపండునాన్ కమ్రగతిని
ఘనత గనన్గ సత్ కవులు గాంచెడి ధీపథ క్రాంత దర్శిగా తరిచి తరిచి
కని మనుపందగున్. కనఁగ కమ్మని తెన్గిది, గ్రాహ్యమిద్ది. మా తేజమంచు
ధనమనుచున్, సదా ధరణి తప్పక నిల్చెడి ద్రవ్యమౌనుగా భద్రతనిడ.
తే.గీ. ప్రభుతయున్ బ్రజ తెన్గును వర్ధిలంగ - చేయ వలయును సద్ గణనీయ కృషిని.
చిత్ర బంధ సద్గర్భాది శ్రీకరమగు - రచనలను చేసి సత్ కవుల్ ప్రబల వలయు.
సీస గర్భస్థ చంపకమాల.
మన తెనుఁగున్ సదా మహిని మన్నన లందెడి మ్రానిపండు నాన్
ఘనత గనన్గ సత్ కవులు గాంచెడి ధీపథ క్రాంత దర్శిగా
కని మనుపందగున్ కనఁగ కమ్మని తెన్గిది గ్రాహ్యమిద్ది. మా
ధనమనుచున్, సదా ధరణి తప్పక నిల్చెడి ద్రవ్యమౌనుగా.
సీస గర్భస్థ కందము.
తెనుఁగున్ సదా మహిని మ
న్నన లందెడి మ్రానిపండు నాన్ ఘనత గనన్
మనుపందగున్ కనఁగ క
మ్మని తెన్గిది గ్రాహ్యమిద్ది. మా ధనమనుచున్,
సీస గర్భస్థ తేటగీతి.
మహిని మన్నన లందెడి మ్రానిపండు
కవులు గాంచెడి ధీపథ క్రాంత దర్శి
కనఁగ కమ్మని తెన్గిది గ్రాహ్యమిద్ది.
ధరణి తప్పక నిల్చెడి ద్రవ్యమౌను.
5. చం. తెలుఁగునఁ గల్గు చిత్రములు, దీపిత గ్రాహ్య మహత్ ప్రహేళికల్,
వెలుఁగులనీను కావ్యములు, వేల్పులఁ జూపెడి భాషణాంశముల్,
సులువగు నీతి పద్యములు, సుందర సద్రచనాదికంబులన్
వెలుఁగఁగ చేయుటే విధిగ ప్రీతిని చేకొనుటొప్పునందరున్.

జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
మన తెలుగు భాషను గురించి చక్కని విసిష్టతను వివరించినందులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.