గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, నవంబర్ 2017, బుధవారం

జ్ఞాన ప్రదాతలు సప్తఋషులు . . . శ్రీ జాజి శర్మ. (06 - 11 - 1948)

జైశ్రీరామ్.
70 వ పుట్టిన ఓజు జరుపుకొనిన
 శ్రీ జాజి శర్మ గారికి
శుభాకాంక్షలు.
జ్ఞాన ప్రదాతలు సప్తఋషులు
మన దేశమే ఒక ''ఋషి పీఠం'', విశ్వగురుపీఠం. ప్రపంచం కళ్లు తెరవక ముందే జ్ఞానతేజం వెల్లివిరిసింది. సమగ్ర విజ్ఞానం, సర్వశాస్త్రాలు ఇక్కడ శోభిల్లాయి. భారతదేశ మంటేనే వెలుగుపై మక్కువ చూపే దేశమని అర్థం అనగా- భారతదేశంలోని అక్షరాలను విడగొట్టి చూస్తే- 'భా' -- అనగా వెలుగు లేదా జ్ఞానము, 'రత'ము అంటే ఇష్టము అని అర్థం.
ఒక దీపం మరో దీపాన్ని, ఆ దీపం మరి కొన్ని దీపాలను వెలిగిస్తుంది, ఇది పరంపరగా కొనసాగుతుంది. చీకటిని పారదోలేది వెలుగు. ఆజ్ఞాన తిమిరాన్ని దూరం చేసేది జ్ఞానజ్యోతి. అది నిరంతరం గురువు నుంచి శిష్యునికి పరంపరగా కొనసాగుతూ ఉంటుంది. ''ఆదిగురువు'' భగవంతుడు. ఆ తేజోదీపం నుంచి మన వరకూ జ్ఞానాన్ని అందించిన పరంపరయే ఋషిపరంపర.
ఋషి అనగా ఋతము వైపు పయనించువాడు. ఋతము అంటే పరమ సత్యమును తెలియజేయు విజ్ఞానం. తపన చేత, తపస్సు చేత అట్టి జ్ఞానాన్ని పొంది, దానిని జగతికి అందించిన వారు ఋషులు. వేదం మొదలుకుని సర్వ భారతీయ శాస్త్రజ్ఞానం వీరు మనకందించిన జ్ఞాననిధి.
ఆధునిక శాస్త్రజ్ఞులు తమ పరిశోధనలను కేవలం భౌతిక విషయ సృష్టికే పరిమితం చేస్తే ఆనాటి ఋషులు భౌతికాతీత విషయాలను (సృష్టిలోని మూల సత్యాలను) ఇంద్రియాతీతమైన ప్రజ్ఞతో తపోబలంతో, నిస్వార్థంగా, జగతికి అందించారు.
ఈ ఋషి పరంపరలో అగ్రగణ్యులు సప్తఋషులు; వారు నేటికీ తేజోస్వ రూపాలుగా, నక్షత్ర రాశిలో మనకు దర్శనమిస్తారు. ప్రతినిత్యం వీరిని స్మరించటం, భారతీయులు ఆనవాయితీ.
1. ఆగస్త్య మహర్షి, 2. అత్రి మహర్షి, 3. అంగీరస మహర్షి, 4. కశ్యప మహర్షి, 5. భృగు మహర్షి, 6. వశిష్ట మహర్షి, 7. విశ్వామిత్ర మహర్షి వీరిని సప్త ఋషులంటారు. కానీ ఈ పేర్ల విషయంలో పలు వివాదాలున్నాయి. వేరు వేరు సప్తఋషుల పేర్లు కనిపిస్తాయి.
1ఆగస్త్య మహర్షి
వశిష్ట మహర్షి సోదరుడు . లోకహితం కోరి దేవతలు వేడుకొనగా వారి కోసం సముద్రాన్ని 'ఔపోసన'పట్టిన వాడు. అగస్త్యుడు శ్రీరామునికి వనవాస కాలంలో పంచవటిలో నివసించమని సూచించి కొన్ని ధనుర్భాణాలను కూడా ప్రసాదించిన వాడు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన 'ఆదిత్య హృదయం' అనే సూర్యస్తోత్రాన్ని, రామునికి ఉపదేశించాడు.
దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తమిళనాడులో ప్రసిద్ధి గాంచిన 'సిద్ధ వైద్యానికి' మూల పురుషుడు ఆగస్త్యుడు. ఇతను రచించిన శక్తిమంత్రము / శక్తిసంహిత/ ఆగస్త్య సంహిత గ్రంధాలలో 'విద్యుత్‌ శక్తి' గురించి, దానిని తయారు చేసే విధానం గురించి వివరింపబడింది. ధనుర్విద్యా రహస్యాలు, ఇతర విద్యలు కూడా దీనిలో ఉన్నాయి.
2. అత్రి మహర్షి,
సప్త ఋషులలో అత్రి మహర్షి ఒకడు. అత్రి మహర్షి అనసూయ భర్త. ఇతను బ్రహ్మ మానసపుత్రుడు. సృష్టి నిర్మాణంలో బ్రహ్మకు సహాయపడిన దివ్య పురుషుడు. త్రిమూర్తులను పసిపాపలుగా చేసి, మాతృభావంతో వారికి అతిథ్యం ఇచ్చింది తపో నిష్టురాలైన అనసూయ. సీతా రామ లక్ష్మణులకు అతిథ్యమిచ్చిన వాడు అత్రి మహర్షి, ఋగ్వేదంలో అత్రి సంహితను ఉపదేశించిన మంత్రద్రష్ఠ. ఆత్రేయ ధర్మశాస్త్రం / ఆత్రేయ స్మృతి అన్నది చాలా ప్రసిద్ధి గల ధర్మశాస్త్ర గ్రంథం. నేటికీ చాలామంది దీనిని పాటిస్తున్నారు. అత్రి మహర్షి కృషి యుగాలు గడిచినా ఇంకా నిలిచి ఉంది.
3. అంగీరస మహర్షి
ఈయన కూడా బ్రహ్మ మానస పుత్రుడు. తన తప:శక్తితో ఈ సృష్ఠి నిర్మాణంలో బ్రహ్మకు సహాయపడ్డాడు. ఇతను కర్ధమ ప్రజాపతి కుమార్తె శ్రద్ధను వివాహ మాడాడు. ఈ అంగీరస వంశం ఎంతగానో వృద్ధి చెందింది. అగ్నికి బదులుగా అతని కార్యం నిర్వహించిన సమర్ధుడు అంగీరస మహర్షి. అంగీరస స్మృతి అనే ధర్మశాస్త్రం లోకమున ప్రసిద్ధి గాంచినది. అంగీరసుడు ఆధర్వణ వేద మంత్రాలకు ద్రష్ట, ఉపనిషత్తులలో అంగీరస ప్రస్తావన ఉంది. అంగీరసుడు ఓంకార రహస్యాలను ముండకోపనిషత్తునందు వివరించాడు. సప్తఋషులలో ఒకడైన అంగీరసుడు సప్త ఋషి మండలంలో తేజోరూపంతో మనలను అనుగ్రహిస్తూ ఉంటాడు.
4. భృగు మహర్షి
బ్రహ్మ హృదయం నుంచి జనించినవాడు భృగువు. నవబ్రహ్మలలో ఒకనిగా ప్రసిద్ధి చెందాడు. భృగు వంశ మూలపురుషుడు.
ఇతను కర్ధమ ప్రజాపతి కుమార్తె ఖ్యాతిని వివాహమాడాడు. యాగఫలాన్ని పొందగల వారిని ఎంచుకొనుటకు త్రిమూర్తులను పరీక్షింపవచ్చి శివునికి లింగాకృతినీ, బ్రహ్మకు గుడిలేని శాపమునూ ఇచ్చి విష్ణువును భూలోకానికి రప్పించిన వాడు. హరిని యాగఫలకర్తగా నిర్ణయించిన తపస్సంపన్నుడు.
భృగుమహర్షి 'జ్యోతిష్య శాస్త్రసారం' రచించాడు. భరధ్వాజునికి సృష్టి రహస్యాలు బోధించాడు. పరశురాముడు శివుని మెప్పించి 'భార్గవాస్త్రం' సంపాదించడానికి ఉపదేశమిచ్చిన వాడు భృగువు.
ధర్మశాస్త్ర సూక్ష్మాలను ఎందరో మహర్షులకు బోధించిన భృగుమహర్షి ప్రాత:స్మరణీయుడు.
5. కశ్యప మహర్షి
ఇతను సప్త ఋషులలో ఒకడు. ఇతను మారీచ మహర్షి పుత్రుడు. కశ్యపవంశ మూలపురుషుడు. ఇతను దక్ష ప్రజాపతి కుమార్తెను వివాహమాడెను. ద్వాదశ ఆదిత్యులను, హిరణ్యాక్ష, హిరణ్య కశ్యపులను, కద్రువ నాగులను, రాహువును, గంధర్వులను, క్రోధమును, గోగణములను, బ్రాహ్మణులను, మేనకాది అప్సరసలను, సిద్ధులను, చంద్రాది దేవతలకు కశ్యపుడు తండ్రిగా జన్మలనిచ్చి సృష్టి ధర్మాన్ని కొనసాగించాడు. ''కశ్యపి'' అనే గంగను భువికి తీసుకుని వచ్చినవాడు. కశ్యప మహామునికి 'వామనుడు' కూడా జన్మించాడు. కశ్యపుని పేరు మీద 'శిల్పశాస్త్రం ఉంది. దీనిలో రాజభవనాలు, దేవాలయాలు, సభామందిరాలు మొదలైన వాని నిర్మాణ సంగతులు. వాస్తుశాస్త్ర రీతులు ఉన్నాయి.
6. వశిష్ట మహర్షి
ఇతను బ్రహ్మ మానసపుత్రుడు. ఇక్ష్వాకుల కుల గురువు. వశిష్టుని సతీమణి మహస్వాధ్వి అరుం ధతి. ఇతడు రామునికి 'యోగ వాశిష్టము' బోధించాడు. ఇది 'గీత' వంటిది. చాలా ప్రసిద్ధి గాంచినది. వశిష్ట స్మృతి, మను స్మృతి తరువాత అంత గొప్పది. క్షత్రియుడైన విశ్వామిత్రుని రాజర్షిగా, బ్రహ్మర్షిగా తీర్చిదిద్దినవాడు. బ్రహ్మతేజో సంపన్నుడు. నవబ్రహ్మలలో ఒకడు. సప్త ఋషులలో ఆరాధ్యనీయుడు వశిష్ఠుడు.
7. విశ్వామిత్ర మహర్షి
విశ్వామిత్రుడు తొలిగా క్షత్రియుడు, రాజు. వశిష్టునితో తలపడి, ఎదురు నిలిచి బ్రహ్మ ఋషి కావాలనే తలంపుతో మహాతపస్సు చేసి బ్రహర్షిగా ఎదిగిన వాడు. విశ్వామిత్రుని గాథ మనకు సదా స్ఫూర్తినిస్తుంది. ప్రతి ఓటమిని ఒక విజయంగా మార్చుకుని సప్త ఋషులలో ఒకనిగా నలిచిన ధీశాలి. విశ్వామిత్రుని చరిత, సాధారణ రాజు ఆధ్యాత్మికంగా ఎదగడానికి బ్రహర్షిగా నిలవడానికి పడిన తపన సప్త ఋషి మండలంలో నిలువ గలగిన సంకల్ప బలం యుగయుగాలకు అందరికి స్ఫూర్తినిచ్చే దివ్యగాథ.
రామునికి శస్త్రవిద్యలను నేర్పించిన వాడు, దుష్టశిక్షణ కోసం రామ లక్ష్మణులను వినియోగించినవాడు. హరిశ్చంద్రుని సత్యశీలత జగతికి చాటినవాడు. త్రిశంకు సృష్టి అనే సృష్టికి ప్రతిసృష్టి చేసిన మహర్షి విశ్వామిత్రుడు. హైందవ జాతి నిత్యం స్మరించే 'గాయత్రి' మంత్రం ప్రసాదించినది విశ్వామిత్రుడే.
ఈ సప్త ఋషులు మనకు సదా రక్షగా నిలిచి మన బుద్ధిని ప్రేరేపించి, మనలను సన్మార్గాలలో నడుపుదురు గాక!
ఎందరో మహర్షులు, వారందించిన విజ్ఞానం అనంతం, వారి విశ్వకళ్యాణ భావం, సంకల్పశుద్ధి జగతిని సదా రక్షించుగాక!
వాల్మీకి, వ్యాసుడు రామాయణ, భారత్రగంథాలు రచించారు. వ్యాసభగవానుడు వేదాలను నాలుగు భాగాలుగా విభజించాడు. అష్టాదశ పురాణాలను రచించాడు.
స్వస్తి.
మంచిమంచి విషయ పరిజ్ఞానాన్ని పాఠకులలో పెంచుచున్న 
శ్రీ జాజి శర్మ గారికి ధన్యవాదములు.
జైహింద్.
Print this post

2 comments:

కందుల వర ప్రసాద్ చెప్పారు...

నేడు 70 వ పుట్టిన రోజును జరుపుకొనుచున్న శ్రీ శ్రీ జాజి శర్మ గారికి
శుభాకాంక్షలు. మంచిమంచి విషయాలు పాఠకులకు పంచుచున్న మీకు వినమ్ర వందనములు..

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

పాండితీ స్రష్టకు ప్రణామములు
జన్మదిన శుభాకాంక్షలు.
జ్ఞాన ప్రదాతలైన సప్తఋషుల యొక్క విశిష్టతను పేరు పేరునా తెలియ జేసినందులకు కృతజ్ఞతలు . మాకందించిన శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.