గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, సెప్టెంబర్ 2017, గురువారం

చెప్పుకోండి చూద్దాం పద్య చిత్రాలు నిన్నటి ప్రహేళికకు సమాధానం.


తెలుగు సాహిత్యంలో ప్రబంధ కవిత్వం ఎలా వెల్లివిరిసిందో అలాగే చాటు పద్యాలు అసంఖ్యాకంగా చోటు చేసుకుని మంచి ఆదరణ పొందాయి.. సాధారణంగా చాటువు ఒకే పద్యంగానో లేదా ఒకటి రెండు పద్యాలుగానో రూపు చెందుతుంది. ఇవి చాలా వరకు ప్రజల నాలుకల్లోనే నిలిచి తర్వాత పత్రముల మీదకు చేరి ఉంటాయి. చాటువుల్లో ప్రౌఢమైన రచనలుంటాయి. సులభమైన రచనలూ ఉంటాయి. చాటువుల్లో అన్ని విషయాలు ఉంటాయి. రాజుల చరిత్రలు, పొగడ్తలు, మంత్రుల తంత్రాలు, ప్రత్యర్ధుల కుతంత్రాలు, వీరగాధలు, శృంగార ఘట్టాలు, హాస్య ప్రసంగాలు, యుక్తి విశేషాలు,ఇలా ఏదైనా ఉండొచ్చు. ఈ చాటుపద్యంలో ఒక విశేషం ఉంది. ఇందులో ఒక గణితాంశము, ఒక చమత్కారము, ఒక బుద్ధి కుశలత, ఒక యుక్తియుక్తమైన ప్రయోగమూ ఉన్నాయి. 

అసలైతే ఈ పద్యం వెనుక ఒక కథ ఉందని చెప్పుకుంటారు. కొందరు బ్రాహ్మణులు దట్టమైన ఒక అడవిగుండా రాత్రిపూట నడుచుకుంటూ వెళుతున్నారు. దారిలో వారికో దొంగల గుంపు ఎదురవుతుంది. ఆ దొంగలు విప్రులను బంధించి ఒక శక్తి గుడికి తీసికెళ్లి బాధిస్తూ ఉంటారు. అప్పుడు ఆ మహాశక్తి భయంకరాకారంతో ప్రత్యక్షమై నాకు బలి కావాలి, మీలో సగం మంది నాకు ఆహారం కావాలి లేకుంటే అందర్నీ భక్షిస్తాను అంటుంది. లెక్క చూస్తే విప్రులు 15, దొంగలు 15 మంది ఉన్నారు. శక్తికి బలిగా ఏ 15 మంది వెళ్లాలి అన్న ప్రశ్న ఎదురై నువ్వంటే నువ్వని పోట్లాట మొదలైంది. అప్పుడు వారిలో ఒక తెలివిమంతుడైన విప్రుడు ఒక ప్రణాలిక రూపొందించాడు. అందరూ వింటుండగా ఆ మహాకాళితో ఇలా విన్నవించుకున్నాడు. " తల్లీ! నువ్వు మా గుంపును కానీ, వాళ్ల గుంపును కానీ బలిగొనడం ఉచితం కాదు. మేమందరమూ నీ చుట్టూ వృత్తాకారంగా నిలబడతాము. నాతో మొదలుపెట్టి ఆవృత్తిగా ప్రతీ 9వ మనిషిని నువ్వు బలి తీసుకొవచ్చు. నీకు ఇష్టమేనా అని అమ్మవారినీ, మిగతా అందరినీ అడిగాడు. అందరూ ఒప్పుకున్నారు. అప్పుడు ఆ విప్రుడు అందరినీ ఇలా నిలబెట్టాడు. ఆ తీరు ఎలా ఉందంటే... 4 గురు విప్రులు - 5 గురు దొంగలు, 2 విప్రులు - ఒక్క దొంగ, 3 విప్రులు - ఒక్క దొంగ, ఒక విప్రుడు - 2 చోరులు, 2 విప్రులు - 3 దొంగలు, 1 విప్రుడు - 2 దొంగలు, 2 విప్రులు, 1 చోరుడు .. వెరసి మొత్తం 30 మంది నిలబడ్డారు. వరుసలో ప్రతీ తొమ్మిదవ వ్యక్తి ముందుకు వచ్చి అమ్మవారికి బలి అయ్యాడు. 15 మంది బలి తరవాత చూస్తే 15 మంది మిగిలారు. అందరూ విప్రులే..

ఇదే మేధా సంపత్తి.. గణిత కౌశలం..



దీని వలన మనకు తెలియవచ్చేదేమంటే.. కవులు అక్షరాల రచనలోనే కాదు అంకెల సంకెలలు వెయ్యటంలోను, విప్పటంలోనూ ఆరితేరినవారు.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చాలా బాగుంది .యుక్తాయుక్తమైన తీర్పు [ గణన ]

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.