గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, ఆగస్టు 2017, సోమవారం

శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.

 జైశ్రీరామ్.
అగణితమైన యీ జగతికాధ్యుఁడు, వర్ధకుఁ డంతకుండునై
సుగుణములందునొప్పుచు, విశుద్ధ గుణాఢ్యుల చిత్తవర్తియై,
ప్రగణితుఁడైన కృష్ణుని యపార కృపామృతమీకు కల్గుతన్
సుగుణ విశాల సద్హృదయసుందరులార! కనుండు కృష్ణునిన్.
పుట్టితి నేను మీ మదిని. పుట్టితి మిమ్ములనుద్ధరింపగా,
నెట్టి దురంత దుస్థితులవేవిధి వచ్చిన నేను కాచెదన్.
గట్టిగ నన్ను నమ్మెడి ప్రగాఢ మహాద్భుత భక్తియుక్తులన్.
కట్టెదుటన్ మెలంగుచును కానగరానని, లేననందురా?

వరలెడి భక్తితోఁ గనఁగ ప్రార్థన చేసెడి వారి ప్రక్కనే
వరలుచు నుందు నేను. వరభావ సమృద్ధుల దేహ వర్తినై.
నిరుప సాధనాపటిమ నిర్మల చిత్తము కల్గు వారిలో
వరగుణరూపినై మెలగి వర్ధిల చేతును వారినిద్ధత్రన్.

పాపమడంతు నేను. గుణ భాసురులన్ గరుణించి కాతు. ని
క్షేపము నేను మౌనులకు. శ్రీకర భారత భూమి నెన్నడున్
శ్రీపతినై సతంబు నివసింతు, జనావళి కోర్కెలన్నిటిన్
నా పనిగా తలంచుచు ననంత శుభంబుల తోడ గూర్చెదన్.
శుభమస్తు.

విన్నారుగా ఆశ్రీకృష్ణుఁడు మీకు దర్శనమిచ్చి ఏమి చెప్పాడో.
చేసుకొన్నవారికి చేసుకొన్నంత పుణ్యం మహదేవా!
అన్యధా శరణం నాస్తి ఐ శరణాగతులైనవారికి మన నల్లనయ్య దయ ఎప్పుడూ లభిస్తుందండి.
మరొక్కమారు మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలండి.
జైహింద్.

Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భముగా అందరికీ శుభాకాంక్షలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.