గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, ఏప్రిల్ 2017, బుధవారం

ప్రజ - పద్యం గ్రంథావిష్కరణ సభ.09-4-2017.

జైశ్రీరామ్.
ఆర్యులారా!



09-4-2017 ఉదయం పది గంటలనుండి పన్నెండున్నర గంటలవరకు జరిగిన ప్రజ - పద్యం గ్రంథావిష్కరణ కార్యక్రమంలో సభాధ్యక్షుఁడుగా నా తొలి పలుకులు పద్యరూపంలో
1. శా. శ్రీదేవీ హృదయాబ్జ భృంగ! విలసచ్చిద్రూప! సర్వేశ్వరా!
మోదంబున్ ప్రజ - పద్య సత్కృతుల నో ముక్తి ప్రదా! కాంచరా!
భూదేవుండు ననంతకృష్ణుఁ డెలమిన్ ముద్రించి రా సత్కవుల్
మోదంబందఁగఁ జేసినార లతనిన్ బూజ్యున్ గృపన్ జూడరా!

3. ముఖ్య అతిథి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి.
చేవ నింపుమ మాలోన హేవిళంబి. 
అని అందరిలోను చేవను పెంచేందుకు హేవిళంబిని కోరిన 
సరస కవి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి.
శా. శ్రీ యెల్లూరి కుటుంబ సంభవ శివారెడ్డిన్ ప్రశంసించెదన్.
మాయాతీతులు. మంచివారు సుకృతిం బ్రఖ్యాతులిద్ధాత్రిపై.
శ్రేయస్కారకులైరి బాలురకు సచ్చీల ప్రభన్ పెంచుటన్.
ధీ యుక్తిన్ ప్రజ - పద్య సద్ రచనలన్ దీపింపఁ జేయున్ సభన్.

4. ఆత్మీయ అతిథి శ్రీ కళా దీక్షితులు.
ఉ. దీక్షను పూని యౌదు రిల దీక్షితు లిత్తరి తెల్గు వెల్గులన్
దక్షత తోడ దిక్తటులఁ దాకఁగ జేసెడి దీక్ష బూనుటన్
దీక్షితులయ్యె వీరు. గుణ ధీవరులౌ వరభావ సత్ కళా
దీక్షిత నామధేయు లిట తెల్గుల వెల్గులు. ధర్మ దీక్షితుల్.

5. శ్రీ కొంపెల్ల రామకృష్ణ. ప్రజ-పద్యం ౧వ న్యాయనిర్ణేత.
క. కొంపెల్ల రామకృష్ణులు - సంపన్నులు భక్తి చేత, సత్ కవులును తా
నింపగు ప్రజ పద్యంబుల - సొంపును గని బహుమతులను చూపిరి కృపతోన్.

6 శ్రీ కోట వేంకట లక్ష్మీ నరసింహం . ప్రజ - పద్యం ౨వ న్యాయ నిర్ణేత.
క. ధరణిని యవధాన గతిని - విరిసిన పూ బంతి కోట వేంకట లక్ష్మీ
నరసింహులు ప్రజ - పద్యము - లరసి బహుమతులను తెలిపి రద్భుత రీతిన్.

7. భాస్కర్రరావు. ప్రజ - పద్యం ౩వ న్యాయ నిర్ణేత.
క. నిరుపమ ప్రజ పద్యము లీ - వర భాస్కరరావు చదివి ప్రథమాదిగ చూ
పిరి బహుమతులను మనలకు - మురియగ మన పద్య కవులు. పుణ్యాత్ములిలన్.

8. బ్రహ్మశ్రీ నారుమంచి వేంకట అనంత కృష్ణ ప్రజ - పద్యం కార్యకర్త ౧.
మ. ప్రజ - పద్యంబను పద్య సద్రచనకున్ బ్రహ్మై, కవీశాళికిన్
నిజ శక్తిన్ కవితామృతంబు చిలుకన్ నేర్పించి నార్మంచి ! స
ద్విజయంబున్ సమకూర్చి, నేడు సభలో విఖ్యాతినే గొల్పిరే!.
విజయోஉస్తు ! శ్రిత రక్ష పాలన పరా! విజ్ఞాన సంపత్కరా!

9. శ్రీ వి. ఆర్. గణపతి ప్రజ - పద్యం కార్యకర్త ౨.
క. గణపతియును బ్రజ - పద్యము - మనమున నడిపించినారు మాన్యులు వారల్.
ఘనమగు నీ విజయమ్మున - గుణ గణ్యులు వారు కూడ, కూర్మిని జూపెన్..

10. శ్రీ యం.వి.పట్వర్ధన్. ప్రజ - పద్యం కార్యకర్త ౩.
క. బ్రజ - పద్యము పటువర్థను - విజయమ్ముగఁ జెప్ప వచ్చు వేమరు వీరున్
ప్రజ - పద్య కవుల కవితలు - నిజ సమయము ఖర్చు చేసి నిచ్చలు చదివెన్.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.