గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, మార్చి 2010, సోమవారం

కవిసమ్రాట్ విశ్వనాథ భావుకత 35.

3 comments

http://www.telugupedia.com/wiki/images/2/2c/ViswanathaSatyanarayana.jpg
-----
ఆంధ్రామృత పాఠక బంధువులారా! విశ్వనాథ రామాయణ కల్ప వృక్షం పై సరైన రీతిలో సుస్పష్టంగా వ్యాఖ్య చెప్పగల పండితోద్దండులు చాలా అరుదుగా మాత్రమే ఉన్నారని చెప్పుకోవడంలో సందేహం లేదు.
-----అట్టి వారిలో సుప్రసిద్ధ కవివతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లు వారి ఉపన్యాస సారాంశాన్ని మీ ముందుంచుతున్న వాటిలో ఇప్పుడు 35 వ భాగం చెప్పుకో బోతున్నాం.శ్రద్ధతో తెలుసుకోవాలనే ఆసక్తి కలవారు లేకపోరు కదా అనే భావనతో అపురూపమైన ఈ ఉపన్యాసాన్ని మీ ముందుంచడం జరుగుతోంది. ఇక చూద్దామా!
మునుపొక సీత కౌగిలికిఁ బొందిన సౌఖ్య మొకండె యిప్పుడో
జనకజలన్ సహస్ర శత సంఖ్యలఁ కౌగిళులన్ సుఖంబులన్
కనుగొనగా సహస్రమును గాక యొకండుగ దోచెఁ భ్రాంతి పొం
దిన మది విచ్చి పోయి సుదతీ విరహానల భాజనుండనై. (వి.రా.క. కి.కాం.నూ.స.35)
-----ఇది వరకు నాకు ఒక్క సీత పరిష్వంగమే లభించింది. కాని; ఇప్పుడో వందల వేల సీతల యొక్క కౌగిళుల లోని సుఖాన్ని పొందుతున్నాను. చూడగా చూడగా ఈ అనేక సీత రూపములు అన్నీ నాకు ఒక్కటి గానే కనిపిస్తున్నవి. సీతా విరహము అనే అగ్ని వలన నా హృదయం బ్రద్దలైంది కదా!
-----శ్రీరాముని విరహాతిశయాన్ని ప్రత్యక్షం చేస్తున్న పద్యమిది. క్రిందటి పద్యంలో సీతను నేను సహస్ర బాహువులతో కౌగిలించుకొంటాను అన్న శ్రీరాముఁడు ఈ పద్యంలో ఉన్మత్తుడైనట్లుగా కవి వర్ణించాఁడు. అంతలోనే ఆ ఉన్మత్తత నుండి తేరుకొని శ్రీరాముఁడు సహస్ర జానకిలను కాక ఒక్క సీతయే తోచు చున్నట్లు పలికెను. సీతా విరహం వల్ల తన హృదయమే బ్రద్దలైనదని ఆశ్వాసించుకొనెను.
-----సీత ప్రకృతి స్వరూపిణి. శ్రీరాముఁడు పరమ పురుషుఁడు. కాగా ఆ ధ్వనిని ఇక్కడ నిబద్ధం చేయడం లోనే కవి ప్రతిభ అంతా దాగి ఉంది. విశ్వనాథ తన రామాయణమును "సకలోహ వైభవ సనాథము" అని చెప్పుకొన్నాఁడు. రస నిర్వహణయందు ఆయన పోకడలు సూక్ష్మతమస్థాయి వరకు పోవును.
-----సీతా విరహమునందున్న శ్రీరామునకు ఎక్కడ చూచిన అక్కడ సీత కనఁబడుట; అందునా వేల వందల రూపాలతో సహజమే. ఆ సీతా ప్రకృతులను ఆయన కౌగిలించుకొనుటయు సహజమే. ఆ విరహ ఔత్కట్యము అట్టిది. ఆయన "సహస్రాక్షః సహస్ర పాత్" అని పురుష సూక్తము కీర్తించిన పరమ పురుషుఁడు. కాని మానవ అవతారమునెత్తిన శ్రీరాముఁడు ఏక పత్నీ వ్రతుఁడు. "రామస్య దయితా భార్యా నిత్యం ప్రాణ సమాహితా". రామునకు సీత ప్రాణాలతో సమానురాలైన భార్య. "ధర్మస్య పరిరక్షితా" అని రాముఁడు కీర్తింపఁబడినాఁడు. అట్టి రాముఁడు ఎంత విరహోన్మత్తుఁడైనను ఆ ఉన్మత్తత యందే ఒకింత తెలివిని పొంది అనేక రూపములలో కనిపించిన సీత మరల నాకు ఒక్కటిగానే కనిపించు చున్నదని చెప్పుట వాల్మీకి చెప్పిన నీతిమాన్ అను గుణమును స్ఫురింపఁ జేయుటయే కదా!
ఇది ఈ ఘట్టములో విశ్వనాథ శిల్ప నిర్వహణా నైపుణిని పతాక స్థాయికి కొనిపోయిన పద్యమని చెప్ప వచ్చును. చేతనాచేతనము లందు సమాన రీతిని ప్రవర్తించుట ఉన్మాదమని లక్షణకారుల తీర్మనము.
-----సామాన్యముగా కావ్యములలో నాయికా నాయకులు సుఖమో దుఃఖమో అనుభవించుచుందురు. ఆ సమయమున వారికి ప్రపంచమే తెలియదు. ఆ సుఖ దుఃఖములను నాటకమున చూచినను కావ్యమున చదివినను సహృదయునకు ఆనందము ఎక్కువగా కలుగును. అట్టి ఆనందము అనుభవించువాఁడే రసమును అనుభవించువాఁడు. సహృదయునకు ఏ రసమును అనుభవించుచున్నను ఆనందమే కలుగును. దుఃఖము కలుగదు. ఆ ఆనందానుభవం పొందిన సమయంలో అతనికి ఇంకేమీ తెలియదు. తనను తాను మరిచిపోవును.
అట్టి ఆనందానుభవాన్నిప్రసాదించే రచనయే విశ్వనాథ రామాయణము.
జైశ్రీరాం.
చూచాం కదా! 35వ భాగన్ని.
అత్యంత ఆసక్తికరమైన అత్యంత ఆలోచనామృతమైన అత్యంత అపురూపమైన తదుపరిదైన 36 వ భాగాన్ని అతి త్వరలో మీకోసం ముందుకు వస్తుంది. అంతవరకూ ఈ భాగంలోని ఆనందామృతాన్ని గ్రోలుదామా!
జైహింద్.

25, మార్చి 2010, గురువారం

జె.పీ.నగర్ దేవాలయంలో సీతారామ కల్యాణం కనులారా చూద్దామా!

6 comments

జే.పీ. నగర్ లో దేవాలయంలో జరిగిన సీతా రామ కల్యాణం కనులారా చూడ గలిగిన వారెంతటి అదృష్టవంతులు!
ఇప్పుడిక్కడ మనం చూడ్డానికి క్లిక్ చేస్తే సరిపోతుంది.
జై శ్రీసీతారాం.
జైహింద్.

24, మార్చి 2010, బుధవారం

రామాయణము పురాణము కాదు; యదార్థ చరిత్ర.

2 comments

జై శ్రీరాం. 
శ్రీమద్ రామాయణ పురానము కాదు; 
యదార్థ చరిత్ర అనడానికి ఈనాటికీ సాక్షీభూతముగా నిలిచిన వాటి చిత్తరువులు.
రావణుడు సీతను దాచిన అశోక వాటిక.


హనుమంతునిచే దగ్ధము చేయఁ బడిన 

రావణ మందిరము.


సుగ్రీవుని గుహ.


ఈ నాటికీ 

అద్భుత
మైన వన మూలికలతో శోభిల్లుతున్న  

లక్ష్మణ ప్రాణ సంరక్షణార్థం హనుమంతుఁడు పెకలించి తెచ్చిన 
సంజీవనీ పర్వతము.
ఈ నీటిలో తేలియాడుతున్న ఈ శిల 

అలనాడు రాముఁడు వారధి నిర్మాణంలో ఉపయోగించినది.
రామ సేతువు.

 రామాయణము పురానము కాదు. యదార్థ చరిత్ర.
జైహింద్.

18, మార్చి 2010, గురువారం

కవిసమ్రాట్ విశ్వనాథ భావుకత 34.

1 comments

కవిసమ్రాట్ విశ్వనాథ భావుకత 34వ భాగము.
ఒక సీతన్  గొని పోయె  రావణుఁడు నాకొక్కొక్క వల్లీ నికుం
జకమందొక్కొక సీత యున్నది. పరిష్వంగంబులం బట్టెదన్
ప్రకటంబైన సహస్ర బాహువుల నే రాముండ నా భార్గవుం
డొక తచ్ఛత్రువు కార్త వీర్యుఁడునుఁ దా మున్నారు నాయందునన్. (వి.ర.క.వృ. కి.కాం. నూ.స. 1- 34. )
రావణుఁడు ఒక సీతను మాత్రమే ఎత్తుకు పోయినాడు. నాకు ఒక్కొక్క పూ పొదయందు ఒక్కొక్క సీత కనబడుతున్నది.  నేను ఈ సీతలను అందరినీ వేయి చేతులతో కౌగలించు కొందును.నేను రాముణ్ణి. నాలో ఒక పరశురాముఁడు అతని శత్రువైన కార్తవీర్యుఁడు ఉన్నారు. నాకిది అసాధ్యము కాదు.  
శ్రీ రాముఁడు ప్రియా విరహి. ఉన్మత్త అవస్థను చేరుకొంటున్నాఁడు. ఇప్పటి దశలో ఆయనకు ప్రకృతి యందు అంతటా సీత సాక్షాత్కరిస్తున్నది.  ఆ క్షణమున శ్రీ రామునకు తన వివాహ సమయమున తాను పరశురాముని నుండి గ్రహించిన సర్వ శక్తులు ఆయనకు స్ఫురించినవి. పరసురాముఁడు తన తండ్రియైన జమదగ్నిని చంపిన కార్త వీర్యుని వేయి చేతులను గండ్ర గొడ్డలితో నరికిన మహా వీరుఁడు. ఆ కార్తవీర్యుఁడెవరో కాదు. రావణాసురునే యుద్ధమునందు జయించి విడిచి పెట్టిన మహా వీరుఁడు.
రావణునే జయించిన కార్తవీర్యార్జునునే పరశురాముఁడు జయించినాడు.ఆ పరశురాముని సర్వ తేజస్సును గుత్తముగా స్వీకరించిన వాఁడు శ్రీరాముఁడు. కావున సహస్ర బాహువులతో సహస్ర జానకీ మూర్తులను కౌగలించుకొందునని శ్రీరాముఁడు పలికినాడు. 
పద్యంలో రాముని అవస్థను తెలుపుతున్న సంచారి భావము  ధృతి అనఁబడుతుంది. లోభము శోకము మొదలగువానివల్ల కలుగబోయే ప్రమాదములను ఈ చిత్త వృత్తి విశేషము అనఁదగిన ధృతి నివారిస్తుంది.
రసనిర్వహణనైపుణ్యము కలిగిన మహాకవుల వాక్కు సహజంగానే అలంకృతమై ఉంటుండి. ఏ భావమైనా హృదయమును అల్లకల్లోలము చేయుట సహజమే. విరహ దశయందున్న శోకము అనేకానేక భావములను సృజించుకొంటూ మరల వెనువెంటనే అంతర్హితము చేసుకొంటూ ఒకానొక క్షణమునందు కలిగిన ఊహను ప్రకటించుకొనే స్థితి మనము ఊహించుకొనవలెను.
రాముని విరహము యొక్క అనవధిభూతమైన పట్టరానిదైన శోక సంతప్తతను పద్యం ఆవిష్కరిస్తున్నది. వాల్మీకములో అందమైన పక్షులు నాకు యౌవనవతి చంద్రముఖి పద్మ నేత్ర యైనసీతను స్ఫురింపఁ జేస్తున్నవి. 
"శ్యామాం చంద్ర ముఖీం స్మృత్వా ప్రియాం పద్మనిభేక్షణామ్
దీపయంతీవ మే కామం - - - - - - - - - " అనినాడు శ్రీరాముఁడు.
విశ్వనాథ తన వర్ణనలో ప్రకృతి స్వరూపిణి యైన సీత రామునకు ప్రతి పొదయందు కనిపించుచున్నట్లు సహస్ర బాహువులతో ఆమెను పరిష్వంగము చేయుదునన్నట్లు వ్రాసెను. ఇది అద్భుతమైన వర్ణన.
ధృతి అనగా కృతార్థత. అనగా ఒకానొక ధైర్యమయిన అవస్థ. అతి వేలమైన దుఃఖంతో మునిగిన మానవుఁడు ఒక దశలో కించిత్ ధైర్యమును పూనుట అన్నమాట.
ఈ రస పోషణ అనునది కవి ప్రతిభననుసరించును.ఈ ఘట్టములో ఇది ఒక అందమైన పద్యము.
(ఇది శ్రీ బులుసు వేంకటేశ్వర్లుగారి ఉపన్యాస సారాంశము)
సెల్. 9949175899.
జైహింద్.   

16, మార్చి 2010, మంగళవారం

శ్రీమద్ వికృతి నామ సంవత్సర నవ నాయక ఫలాదులు.

6 comments

శ్రీ యుత పాఠకులారా!
జ్ఞేయము వత్సర ఫలంబు. చెప్పెద మీకున్.
శ్రేయముకలుగును చదివిన
మాయును పాపాదులఖిల మహిమలు కలుగున్.

సంవత్సరము పేరు వికృతి:- తత్ఫలం.
ప్రకృతియు వికృతిగ మారును
వికృతియు ప్రకృతిగ యగుఁ గన విశ్వ జనములీ
వికృతిని సంతోషముఁ గను.
ప్రకృతము భయ మొంద నేల? భక్తిని కలుగన్?

శ్రీ వికృతి  నామ సంవత్సర నవ నాయకాది ఫలములు:-
1) రాజు కుజుఁడు. దాని ఫలము.
పాలకుల మధ్య కలహము ప్రబలమగును.
భయము అగ్నిని; చోరుల భయము మెండు.
రోగ సర్ప భయంబులు రోత పుట్టు;
పంట పండక భూములు పాడు పడును.

2) మంత్రి బుధుఁడు. దానిఫలము:-
మేఘములు వాయు సహితము. మేలు కొంత.
పాప కర్మల తోగును ప్రజల మనసు.
మధ్య ఫలదము గావున మాన్యులెల్ల
మంచి నడవడి మరువక మసల వలయు.

3) సేనాధిపతి కుజుఁడు. దాని ఫలము:-
కుజుఁడు రాజుగ నేదిచ్చు కూర్చు నదియె
పాలకులమధ్య కలహము;ప్రబలు రోగ
చయము; పంటలు తగ్గును.జ్వరము హెచ్చు.
మంచి వారికి శుభములు మసలు నెపుడు.

4) సస్యాధిపతి శని. దాను ఫలము:
మినుములు; ఉలవలు; నువ్వులు; 
ధనరాశులఁ గురియఁ బండు; తప్పక నిజమౌ
ను. నలుపు ధాన్యము; భూమియు
ఘనతరముగ పండఁ జేయ గల్గును రైతుల్.

5) ధాన్యాధిపతి గురుఁడు. దాని ఫలము:-
చక్కగ పంటలు పండును.
చక్కగ వర్షములు గురియు చాలగ పాలన్
చిక్కగ గోవులొసంగును.
దక్కును సుఖ శాంతు లధిక ధన్యత నొప్పున్.

6) అర్ఘాధిపతి కుజుఁడు. దాని ఫలము:-
గాలియు వర్షము కలియును.
తేలిక వర్షములు కురియు;  తృప్తి నటనటన్
మేలగు పంటలు పండును.
మేలుగ స్వస్థతను గొల్పు మేలుగ నొప్పున్.

7) మేఘాధిపతి కుజుఁడు. దాని ఫలము:-
గాలులు చెల రేగు; నిజము.
నేలలు యెర్రనివి పండు నేర్పును చూపున్.
నేలకు ధరలిక దిగునయ!
మేలగు కాలంబు మనకు. మేలగు. వినినన్.

8) రసాధిపతి చంద్రుఁడు. దాని ఫలితము:-
రస వస్తువులవి పెరుగును.
ఇసుమంతయు తగ్గబోవు. ఎన లేని ధరల్
దెస గానక పేదలదురు.
విష తుల్యము చంద్ర ఫలము వెరపును గొలుపున్.

9) నీరసాధిపతి శుక్రుఁడు. దాని ఫలము:-
నీరసాధిపతిగ నెగడు శుక్రుఁడు గాన
గంధ; ముత్య, కపుర కనకములకు
ధరలు పెరుగు. జనులు తల్లడ మందును.
తరుగ నేర్వకుండ పెరుగు చుండు.

ఆఢక ప్రమాణము, ఆఢక స్థితి:-
29 - 7 - 2010. వరకుకుంము బాల బ్రాహ్మణుని చేతియందు;  తరువాత
25 - 10 - 2010 వరకు యువ బ్రాహ్మణుని చేతి యందు;  
ఆ తరువాతవృద్ధ బ్రాహ్మణుని చేతియందు ఉండుత కరణముగా యావత్ సంవత్సరము వర్షాభావము తోను; అతి వృష్టి తోను అల్ల కల్లోలముగ నుండును.


గురు మూడము:-
తే. 19 - 03 - 2010 వరకు.
తే. 23 - 03 - 2011 నుండి తే. 24 - 04 - 2011 వరకు.

శుక్ర మూఢము:-
తే. 23 - 10 - 2010 నుండి తే. 04 - 11 - 2010. వరకు.

గ్రహణములు మనకు కనపడునవి లేవు.

అధికమాసముగా వైశాఖము ఈ సంవత్సరం వస్తుంది.

ఆదాయ - వ్యయములు
మేషం:-   8 - 14.
వృషభం:- 2 - 8.
మిధునం:- 5 - 5.
కర్కాటకం :- 14 - 2.
సింహం :- 2 - 14.
కన్య :- 5 - 5.
తుల :- 2 - 8.
వృశ్చికం :- 8 - 14.
ధనుస్సు :- 11 - 5.
మకరం:- 14 - 14
కుంభం :- 14 - 14.
మీనం. :- 11 - 5.

రాజ పూజ్య - ఆవమానములు
మేషం: :-  4 - 3
వృషభం :- 7 - 3.
మిధునం :- 3 - 6.
కర్కాటకం :- 6 - 6.
సింహం :- 2 - 2.
కన్య :- 5 - 2.
తుల :- 1 - 5.
వృశ్చికం :- 4 - 5.
ధనుస్సు :- 7 - 5.
మకరం :- 3 - 1.
కుంభం :- 6 - 1.
మీనం. :- 2 - 4.

మొత్తముపై సంవత్సర ఫలం:- రాజకీయ వేత్తల స్వార్థ పూరిత దౌర్భాగ్య ప్రవృత్తికి పరస్పర ఆరోపణా నిందించుకోడాలకు లోటుండదు.
గత సంవత్సరం కన్నా మేలుగానే ఉంటుందని చెప్పుకో వచ్చును.
మంచివారికి తప్పక మంచే జరుపుతుందీ వికృతి వత్సరము. దైవ శక్తి రక్షగా నిలుస్తుంది.
స్వస్తి ప్రజాభ్య: !
కాలే వర్షతు ఫర్జన్య:!
లోకా: సమసా: సుఖినో భవంతు.
మంగళం భగవాన్ విష్ణుం; సార్వభౌమాయ మంగళం.
జైహింద్.

15, మార్చి 2010, సోమవారం

శ్రీ వికృతి ఉగాది శుభాకాంక్షలు.అందుకోండి యీ కంద గీత గర్భ ఉత్పలమాల.

6 comments


http://lovelysunrise.files.wordpress.com/2009/03/mamidi.jpg
శ్రీ వికృతి ఉగాది శుభాగమనం సందర్భంగా పుణ్యమూర్తులైన ఆంధ్రామృత పాఠకాళికీ; యామ దాంధ్రులకూ; సమస్త భారతీయులకూ ఆయురారోగ్య ఐశ్వర్యాలు; సుఖ శాంతులు; వర్థిల్లుతూ; ఆనందామృతాన్ని పంచే ఆంధ్రామృతం గ్రోలుతూ; చిరకాలం వర్థిల్లాలని ఆకాంక్షిస్తూ; ఆ పరమాత్మను ప్రార్థిస్తున్నాను. 
శ్రీ గుణ శోభనీ వికృతి క్షేమ నయంబుల వెల్గఁ జేయ మా
బాగెముగా నిటే వెలుగు పంటలఁ జేరెను; ప్రేమఁ జూపి; సే
వా గుణ మిచ్చుతన్! పరమ భ్రాంతి; నిరంతర భక్తి గొల్పు; నీ
బాగు గనున్! సదా సిరుల ప్రాప్తిని వర్ధిలఁ జేయు మిమ్ములన్.

గుణ శోభనీ వికృతి క్షే
మ నయంబుల వెల్గఁ జేయ మాబాగెముగా!
గుణ మిచ్చుతన్! పరమ భ్రాం
తి; నిరంతర భక్తి గొల్పు; నీబాగు గనున్!

వికృతి క్షేమ నయంబుల వెల్గఁ జేయ
వెలుగు పంటలఁ జేరెను; ప్రేమఁ జూపి;
పరమ భ్రాంతి; నిరంతర భక్తి గొల్పు;
సిరుల ప్రాప్తిని వర్ధిలఁ జేయు ముమ్ము!  
జైహింద్.





13, మార్చి 2010, శనివారం

ఈ రోజు ఐన్యూస్ లో శ్రీ నల్లమోతు శ్రీధర్ లైవ్ షో. 9am To 9:30am.

0 comments

పాఠక మిత్రులారా! శుభోదయం.
ఈ రోజు ఐన్యూస్ లో శ్రీ నల్లమోతు శ్రీధర్ లైవ్ షో. 9am To 9:30am. ఉంది.


ఈరోజు (మార్చి 13 ఉదయం 9 నుండి 9.30 వరకూ ఐ న్యూస్ లో) 
ఇంటర్నెట్ లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందుల సమయంలో పోలీసు యంత్రాంగాన్నీ, ఇతర స్వచ్ఛంధ సంస్థలను ఎలా అప్రోచ్ అవాలి తదితర అంశాలపై డిస్కషన్ లైవ్ ఉంటోంది.
ఇది మనం తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశం. ఉపేఖచేయకుండా సరైన సమయంలో మనం తీరిక చేసుకొని, విన కలిగితే ఉపయోగకరంగా ఉంటుందని నా విశ్వసం.
జైహింద్.

12, మార్చి 2010, శుక్రవారం

మేలిమి బంగారంమన సంస్కృతి 92.

1 comments

ప్రియ పాఠకులారా! 
సత్య వాక్ పరిపాలన విషయంలో మనం చాలా విన్నాం. అసత్య దూరులుగా ఉంటున్నాం. ఐతే ఆ సత్యవాక్ పరిపాలనమే ఒక్కొక్కసారి అప్రయోజనమే కాక ప్రమాదము కూడా కలిగించవచ్చును. ఈ విషయంలో ఒక కవి ఈ క్రింది శ్లోకంలో ఎంత చక్కని ఉపమానంతో వివరించి చెప్పాడో చూద్దామా?
శ్లోll
శూన్యతా పుణ్య కామేన వక్తవ్యానైవ సర్వదా
ఔషధం యుక్తమస్థానే గరళం నను జాయతే.
గీll
సత్యమైనను వ్యర్థమస్థానమైన
పలుక రాదది దుష్టమౌ ఫలిత మిడును.
ఔషధం బది యగుత  యస్థానమునను
విషఫలంబిడు నరయుచు మసల వలయు.
భావము:-
మంచి ఔషధమే కాని; అస్థానమందు ఉపయోగించినచో అదే విషమైపోతుంది కదా! అదే విధముగ ఒక విషయము సత్యమే కావచ్చు. కాని అది నిరుపయోగమైనదీ; అస్థానీయమైనదీ కావచ్చు. కావున  పుణ్య కామి యగువాడు సత్యమైనా శూన్య వచనము పలుకరాదు.
కావున విజ్ఞతతో మెలగుదాం.
జైహింద్.

8, మార్చి 2010, సోమవారం

ఆదిశక్తిస్వరూపిణులైన మహిళా మణులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

1 comments


సృష్టి కారకులైన ఆదిశక్తికి ప్రతీకలై అమృత మూర్తితైన అమ్మగా అనురాగాలొలికించే సహోదరిగా ఆట పాటలాడుతూ అలరారుతూ ఆనందాలు చిందించే ఆడ పడచుగా ఆత్మీయతను పంచి అంతర్గత మహత్శక్తిని వెలికి తీసే ఆత్మీయురాలుగా అసాధారణ ప్రతిభా పాటవాలతో ఇంటా బైటా పరిపూర్ణ బాధ్యతతో ప్రవర్తిస్తూ కుటుంబానికి సమాజానికీ తోడూ నీడగా నిలిచిన అనుపమాన గృహిణిగా అన్ని రంగాలలొ తమదైన శక్తి సామర్థ్యాలతో పురోగతిసాగిస్తూ సమాజం ముందుకు సాగడానికి సహకరిస్తున్న అద్భుత ఆది పరాత్పరగా సహృదయ హృదయాలలో అమృత మూర్తిఐన అమ్మగా జీవన యానం సాగిస్తున్న మహిళా మణు లందరికీ పాదాభివందనములు చేస్తూ అభినందిస్తున్నాను.
అన్నిట శక్తి రూపమున అద్భుతమై యలరారు తల్లులే
క్రన్నన భూ ప్రపంచమున హాయినొసంగెడి అమ్మ యయ్యె. మా
కన్నుల పెట్టి కావదగు. గాంచుచు మిమ్ముల నమ్మలార! మీ
కన్న పసిండి బాలుడనగా నను గాంచుచు నాదరింపరే!
స్త్రీ లోకానికి ముగురమ్మల మూలపుటమ్మల ప్రతీకలైన స్త్రీ మూర్తులందరికీ అభినందన మందార మాల.
జైహింద్.

7, మార్చి 2010, ఆదివారం

చిలమకూరు లీలా మోహనునికి నా సవాల్.

3 comments


శ్రీ చిలమకూరు విజయ మోహనులు తమ లీలామోహనం బ్లాగులో కృష్ణ కృష్ణ హరి గోవిందా అనే శీర్షికతో బొమ్మల కొలువును ప్రదర్శించారు.  అన్నీ శ్రీ కృష్ణుఁడు బొమ్మలే.
ఆపరమాత్మకైనా పురాకృత కర్మ తప్పదు కదా!
అందుకే  ఈ బొమ్మలకొలువు ఎందుకు పెట్టామో వివరిస్తూ  నేనొక సవాలు చేసాను కృష్ణుఁడికి. చూడండి.
బొమ్మలఁ జేసి మమ్ములను; బోలెడు ఆటలనాడు చుందువే!
ఆమ్మను కూడ బొమ్మగనె ఆడగ చేసిన పాపమిద్ది. నిన్
బొమ్మలఁ జేసి ఆడెదము. పూర్తిగ నీవొక బొమ్మవైతి!!! సి
ద్ధమ్మిది!  వేణు గోపకుఁడ! ధైర్యము కల్గిన కాన రమ్మురా!
ఆ పరమాత్మ నా సవాలును స్వీకరిస్తే మాత్రం తప్పక కనిపించక మానడు. లేదా మొహం చాటేసినా చాటేస్తాఁడు. లీలా మానుష విగ్రహుఁడు కదా! వేచి చూద్దాం ఏం చేస్తాడో!
జైహింద్.

5, మార్చి 2010, శుక్రవారం

మేలిమి బంగారం మన సంస్కృతి. 91.

1 comments

మాన్య పాఠకులారా!
ఈ భూదేవి  ఇంకా ధర్మ బద్ధంగా కొంతైనా ప్రకృతి ధర్మం పాటిస్తోందంటే దానికి కారణం ఇంకా భూమిపై మహానుభావులు; మహా పతివ్రతలు; మహోన్నత గుణ గరిష్టులూ వారి పాదాల్తాకిడితో పునీతం చేస్తున్నందు వలననే నని మనం ప్రగాఢంగా నమ్మాలి.
అట్టి మహానుభావులను గూర్చి ఆనందించనివారుండరు; బహుశా దురుద్దేశపరులు తప్ప.
ఆటువంటి మహాత్ములను గూర్చి ఒక సంస్కృత కవి ఏం చెప్పాడో చూడండి.
శ్లోll
యస్మిన్ శ్రుతి పథం ప్రాప్తే దృష్టే స్మృతిముపాగతే!
ఆనందం యాంతి భూతాని జీవితం తస్య శోభతే!
ఆ.వెll
ఎవని పేరు విన్న ఎవని రూపము కన్న
ఎవని స్పర్శ జేసి  ఎన్న లేని
సుఖము; తృప్తి; కలిగి చూచు, నానందించు
జనులు . అట్టి వాని జన్మ జన్మ! 
భావము:-
ఎవ్వని నామ శ్రవణ మాత్రముననే దర్శన మాత్రముననే స్పర్శ మాత్రముననే సర్వ జీవులును పరమానందము నొందు చున్నవో హాత్ముని జీవితమే శోభస్కరము కదా!
ఆట్టివారు మరెక్కడో లేరు. మీలోనే ఉన్నారని నా ప్రగాడ విశ్వాసం. అట్టి వారికి పాదాభివందనం చేస్తున్నాను. స్వీకరించగలరు.
జైహింద్.

కవిసమ్రాట్ విశ్వనాథ భావుకత 33.

0 comments

ప్రియ సాహితీ బంధువులారా!
కవివతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లు రామాయణ కల్ప వృక్షంలో  కవిసమ్రాట్ విశ్వనాథ భావుకతఅను అంశంపై  చేసిన ఉపన్యాసమునుండి ఇప్పుడు 33 వభాగమును మీ ముందుంచుతున్నందుకు ఆనందంగా ఉంది.
నోరున్ వెయియు లేనిజంతువులు నన్నుం జూచి జాలిం బడున్
తా రక్షః కటు జాతి యూరక విరోధం బూను నేనన్నచో
నౌరా! సృష్టి సమస్త మొక్కడును దైత్య శ్రేణి యొక్కండునున్
స్ఫారంబై చను సృష్టి యిర్మలకలై వైతన్య ధారా స్రుతిన్.(వి.రా.క.వృ. కి.కా.1 - 33.)
నోరు వాయి లేని జంతువులు నన్ను చూసి జాలి పడుతున్నవి. ఈ రాక్షస జాతి కర్కశ హృదయంలో నేనంటే చాలు విరోధులుగ మారుతున్నారు. ఔరా! సృష్టి అంతా ఒక ఎత్తు, ఈ రాక్షస జాతి ఒక ఎత్తుగా కనిపిస్తున్నాయి.  సృష్టి లోని చైతన్యము రెండు ప్రవాహాలుగా సాగుతున్నదా అనిపిస్తోంది. ఇదీ రాముని ఉద్దేశ్యము.
మన దేశము నిజముగా మానవ జాతికి సుఖము సమ కూర్చ దలచినచో ఆధ్యాత్మిక ప్రవృత్తియు, స్త్రీ పురుష మధ్య గత నీతియు, దైవ భక్తియు కలిగి యుండ వలయునన్నది విశ్వనాథ ఆకాంక్ష.వ్యక్తి ద్వారా సమాజము, సమాజము ద్వరా వ్యక్తి రక్షింప బడాలన్నది ఆయన తపన. వందలాది రచనల్లో విశ్వనాథ సంఘ శ్రేయస్సును మానవ పురోభివృద్ధిని ఆ మార్గమున కోరుకొన్నాడు.
ఇక్కడ శ్రీ రాముడు నోరు వాయి లేని జంతువుల కన్నా రాక్షస జాతి హీనమయినదనిభావించు చున్నాడు. ఎందువలన? నిష్కారణముగా పరులకు అపకారము చేయు స్వభావమే రాక్షస ప్రవృత్తి.  " వ్యథాన్యార్థ భంగము గావించెడి వారలెవ్వరొ యెఱుంగన్ శక్యమే యేరికిన్ " అని ఒక కవి చెప్పినట్లు ఊరక విరోధంబూని ఇతరుల్ని హింసించెడి వారు కటు జాతికి చెందిన వారు.
నదులు , చెట్లు, మేఘాలు , సజ్జనులు , ఓషధులు ఇవన్నీ మానవులకు కనిపించని దేవతలై ఉపకారం చేస్తున్నవి. తమను శాసనం చేసే వారి పట్ల కూడా అవి కరుణాంతరంగములై కాపాడుతున్నవి. సమాజం లోని చైతన్యవంతమైన జీవి యైన మనవుడు స్వార్థం, ద్వేషం, క్రోధం, లోభం,మొదలగు గుణాలతోను, పశు ప్రవృత్తి తోను, తమో భావుడై చరిస్తున్నాడు.
దైత్యత్వం అంటే కరడు గట్టిన తమో గుణమే.సృష్టి అంతా ఒక ఎత్తు, ఈ రాక్షస జాతి ఒక ఎత్తు. అటున్నాడు శ్రీరాముడు. సృష్టి అంత చైతన్య సంభరితమే. కాని ఆచైతన్య ధారా స్రుతి యందు సృష్టి ఇర్మలకలయింది. అనగా రెండు మలుపులు తిరిగింది. ఒక వైపు మలుపు పరమార్థ పథము కాగా రెండవ మలుపు స్వార్థ పథము. ఒకటి వెలుగు, మరొకటి చీకటి. ఒకటి సత్యము, మరొకటి తమస్సు.
రాక్షసులు కూడా మానవ జాతిలోనివారే. అరిషడ్ వర్గమును అహంకారమును పోసి పెంచుకున్న హృదయాలు వారివి. వారి ప్రాబల్యం కోసం వారు జాతి నాశనమునకైనా సిద్ధ పడతారు. విశ్వ కల్యాణము కాదు వారి లక్ష్యము స్వ కల్యాణమే. భోగైక పరాయణతయే వారి చరమ సిద్ధాంతము.
సృష్టి లోని ఈ చీకటి కోణాలకు వెలుగు పంచడానికి అవతరించిన పరంధాముడే శ్రీరాముడు. సత్వ చైతన్య స్వరూపుడైన భగవానుడు రాముడు. లోకంలోని అహంకార స్వరూప నిరకుశ ప్రదీప ధర్మైక ప్రతీపమైన రాక్షస ప్రవృత్తిని పరిశీలించిఆశ్చర్యపోవడం ఇక్కడ మనం గమనించ వచ్చును.
సుందర కాండలో హనుమంతుడు సీతమ్మ ముందు నిలబడి చేసిన శ్రీరామ వర్ణనమునందలి మాటలను మనము జ్ఞాపకము చేసుకో వలెను.
" సత్య ధర్మ పరః శ్రీమాన్ సంగ్రహానుగ్రహే రతః.
దేశ కాల విభాగజ్ఞ సర్వ లోక ప్రియం వదః. "
రామునకు సత్య ధర్మముల యందు ఆదరము మెండు. శ్రీ రాముడు (శోభావహుడు) జనులకు చేరువైనాడు. ప్రజలను అనుగ్రహించేవాడు. దేశ కాలముల యుక్తాయుక్తముల ను తెలిసిన వాడు. అందరికీ ప్రియంగా మాట్లాడేవాడు.
సంపూర్ణ నాగరకతా విభూషితుడైన రామునకు ఈ రాక్షస జాతి లక్షణములు ఆశ్చర్యము కలిగించక మానునా?
జైహింద్.  

3, మార్చి 2010, బుధవారం

ఈ రోజు 37 వపుట్టిన రోజు జరుపుకొంటున్న శ్రీ నల్లమోతు శ్రీధర్.

11 comments


బ్లాగ్ మిత్రులు ; కంప్యూటర్ ఎరా నిర్వాహకులు చిరంజీవి నల్లమోతు శ్రీధర్
1974 మార్చ్ 3 వ తేదీన జన్మించారు. 
ఈ రోజు 37 వ పుట్టిన రోజు జరుపుకొంటున్న సందర్భంగా చిరంజీవి శ్రీధర్ కు ఆంధ్రామృతం పాఠకుల తరపున అభినందనలు తెలియఁ జేస్తోంది.
జీవితమనే పుస్తకంలో గడచిన కాలం అనే పుటల ద్వారా సంపాదించిన జ్ఞానంను ఉపయోగించుకొని మనయొక్క సమాజం యొక్క ఉజ్వల భవితకు మార్గం సుగమం చేసుకొంటుంటాం.
శ్రీధర్ కూడా ఇటువంటి పుట్టిన రోజులు పండుగలు శతాధికంగా చేసుకోవాలని; ఆశక్తిని పరమాత్ముఁడు దయతో కలుగ జేయాలనీ మనసారా కోరుకొంటున్నాను..
జైహింద్.