గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, సెప్టెంబర్ 2017, ఆదివారం

కూష్మాండ ( కామాక్షి ) .. .. .. చిత్ర బంధ గర్భ కవితాదులు.,

0 comments

 జైశ్రీరామ్.
ఆర్యులారా! నేడు నాలుగవ రోజున జగన్మాత కూష్మాండ రూపమున మనలనఉ కటాక్షించుచున్నది.
దరహాసము చేయుచు (అవలీలగా) బ్రహ్మాండమును సృజించునది గావున ఈ దేవి 'కూష్మాండ' అను పేరుతో విఖ్యాత యయ్యెను. ఈమె సూర్య మండలాంతర్వర్తిని. ఈమె తేజస్సు నిరుపమానము. ఈమె యొక్క తేజోమండల ప్రభావముననే దశదిశలు వెలుగొందుచున్నవి. బ్రహ్మాండము లోని సకల వస్తువులలో, ప్రాణులలో గల తేజస్సు ఈమె ఛాయయే.

'అష్టభుజాదేవి' అని కూడా అనబడు ఈమె ఎనిమిది భుజములతో విరాజిల్లిచుండును. ఏడు చేతులలో వరుసగా కమండలువు, ధనుస్సు, బాణము, కమలము, అమృతకలశము, చక్రము, గద - అనునవి తేజరిల్లుచుండును. ఎనిమిదవ చేతితో సర్వసిద్ధులను, నిధులను ప్రసాదించు జపమాల యుండును. ఈమెయు సింహవాహనయే.

భక్తులు ఈ దేవిని చక్కగా ఉపాసించుటచే పరితృప్తయై ఈమె వారి రోగములను, శోకములను రూపుమాపును. ఈమె భక్తులకు ఆయుర్యశోబలములు, ఆరోగ్యభాగ్యములు వృద్ధిచెందును. కొద్దిపాటి భక్తిసేవలకును ఈదేవి ప్రసన్నురాలగును.ఈ జగన్మాత మిమ్ములను సరా నీడవోలె ఉండి రక్షించుగాక.
కూష్మాండ ( కామాక్షి )
శ్లో||  సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ|
దధానా హస్త పద్మభ్యాం కూష్మాండా శుభ దాస్తుమే ||
ప్రణవ వృత్త గర్భ సీసము. ( ప్రణవ వృత్తము - మ న య గ .. యతి 6 )
నిర్మల రూప! నే నిన్ మ్రొక్కెద నిల కూ  ష్మాండా! జగన్మాత! శంభురాణి!
నోరార పిల్తు దీనున్ నన్ గని తెరవున్  జూపన్ గదే తల్లి! శోభఁ గొలుప.
ఆనంద పూర్ణజ్ఞానాంభోధివి కనవే  మమ్మా! మహా దేవి! సమ్మతమున.
నవతేజ పూజ్య! ప్రాణంబీవెగ పరమే  శానీ! మహాదేవి! జ్ఞానమిమ్ము.
తే.గీ. 
నిత్యకల్యాణివీవమ్మ! నిరుపమాన! - సత్య సన్మార్గ గా సలుపు నన్ను.
బంధ చిత్రాదులన్ గల భారతాంబ! - సుందరోజ్వల తేజమా! చూపు భవిత.
సీసగర్భస్థ ప్రణవ వృత్తము
నే నిన్ మ్రొక్కెద నిల కూష్మాండా! - దీనున్ నన్ గని తెరవున్ జూపన్ 

జ్ఞానాంభోధివి కనవేమమ్మా! - ప్రాణంబీవెగ పరమేశానీ!
నైవేద్యం : చిల్లులులేని అల్లం గారెలు
జైహింద్.

23, సెప్టెంబర్ 2017, శనివారం

చంద్రఘంట (అన్నపూర్ణ) .. .. .. అంతరాక్కర - తేటగీతి - ఆటవెలది ద్వయ గర్భ సీసము. .. .. .. చిత్ర బంధ గర్భ కవితాదులు.,

0 comments

 జైశ్రీరామ్.
ఆర్యులారా! శరన్నవరాత్రులలో ఈ మూడవ రోజున జగదంబ మనలను చంద్రఘంట(అన్నపూర్ణ) గా కరుణిస్తుంది.
ఈ తల్లి తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండుటచే ఈమెకు 'చంద్రఘంట' యను పేరు స్థిరపడెను. ఈమె శరీరము బంగారు కాంతి మయము. ఈమె తన పది చేతులలో ఖడ్గము మొదలగు శస్త్రములను, బాణము మున్నగు అస్త్రములను ధరించియుండును. ఈమె సింహ వాహన. ఈమె సర్వదా సన్నాహయై యుద్ధముద్రలోనుండును. ఈమె గంటనుండి వెలువడు భయంకరధ్వనులను విన్నంతనే క్రూరులై దైత్య దానవ రాక్షసులు ఎల్లప్పుడు వడగడలాడుచుందురు. కాని భక్తులకును, ఉపాసకులకును ఈమె మిక్కిలి సౌమ్యముగను, ప్రశాంతముగను కన్పట్టుచుండును.

ఈ దేవి ఆరాధన సద్యఃఫలదాయకము. భక్తుల కష్టములను ఈమె అతి శీఘ్రముగా నివారించుచుండును. ఈ సింహవాహనను ఉపాసించువారు సింహ సదృశులై పరాక్రమశాలురుగా నిర్భయులుగా ఉందురు. ఏవిధమైన భయములును వారిని బాధింపజాలవు.
సర్వ మంగళ స్వరూపిణియైన ఈ తల్లి ఆశీస్సులు మీకు లభించాలని మనసారా కోరుకొంటున్నాను.
చంద్రఘంట(అన్నపూర్ణ)
శ్లో|| పిండజప్రవరూరుఢా చంద్రకోపాస్త్ర కైర్యుతా|
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||
అంతరాక్కర - తేటగీతి - ఆటవెలది ద్వయ గర్భ సీసము
మాన్య రూప! నిరుపమము చంద్రఘంట నీ నిర్మలాత్మ సుగుణ ధర్మ బోధ.
కలిమిఁ గూర్చి కరుణఁ గను తల్లి వీవెగా కాపు మాకు కనఁగ కామిత ప్రద!
నయతనీయ, సరగునను వచ్చి కొల్పు సత్సంగ రక్తి.  వరశుభాంగ నీవు..
ఎన్ని చూడ తరుణ మిది కావ నన్ను తత్వార్థ భాస! కనుమ! వరల నిమ్మ!
తే.గీ. నీదు పాదాబ్జములపైన నాదు మనసు
నిలువఁ జేయుమ! మాయమ్మ! నిన్నె కొలుతు.
నీవె రక్షీంపకున్నచో త్రోవ లేదు.

పార్వతీ! పతి తోడుగ వరలు మదిని.

సీస గర్భస్థ  అంతరాక్కర. 
(అంతరాక్కర1సూ.గణము, 2ఇం.గణములు, 1చం.గణము .. 
యతి 3వ గణము చివరి అక్షరము)
నిరుపమము చంద్రఘంట నీ నిర్మలాత్మ 
కరుణఁ గను తల్లి వీవెగా కాపు మాకు
సరగునను వచ్చి కొల్పు సత్సంగ రక్తి
తరుణ మిది కావ నన్ను తత్వార్థ భాస! 

సీస గర్భస్థ  తేటగీతి..
నిరుపమము చంద్రఘంట నీ నిర్మలాత్మ 
కరుణఁ గను తల్లి వీవెగా కాపు మాకు
సరగునను వచ్చి కొల్పు సత్సంగ రక్తి. 
తరుణ మిది కావ నన్ను తత్వార్థ భాస! 

సీస గర్భస్థ ఆటవెలది ద్వయము.
౧. మాన్య రూప! నిరుపమము చంద్రఘంట నీ - నిర్మలాత్మ సుగుణ ధర్మ బోధ.
కలిమిఁ గూర్చి కరుణఁ గను తల్లి వీవెగా - కాపు మాకు కనఁగ కామిత ప్రద!
౨. నయతనీయ, సరగునను వచ్చి కొల్పు స - త్సంగ రక్తి.  వరశుభాంగ నీవు..
ఎన్ని చూడ తరుణ మిది కావ నన్ను త - త్వార్థ భాస! కనుమ! వరల నిమ్మ!
జైహింద్.

22, సెప్టెంబర్ 2017, శుక్రవారం

బ్రహ్మచారిణి( గాయత్రి ) రుచిర గర్భ సీసము. .. .. .. చిత్ర బంధ గర్భ కవితాదులు.,

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శరన్నవరాత్రులలో రెండవ రోజైన నేడు ఆ జగన్మాత బ్రహ్మచారిణి రూపంలో మనలను కటాక్షిస్తుంది.
'బ్రహ్మచారిణి' యనగా తపమాచరించు తల్లి. బ్రహ్మమునందు చరించునది.కుడి చేతియందు జపమాలను, ఎడమచేతియందు కమండలువును ధరించును. పరమేశ్వరుని పతిగా బడయుటకు తీవ్రమైన తపమొనర్చి ఉమ యని ప్రసిద్ధి వహించెను. ఈ దేవి స్వరూపము జ్యోతిర్మయము. మిక్కిలి శుభంకరము. భక్తులకును, సిద్ధులకును అనంత ఫలప్రథము. బ్రహ్మచారిణీ దేవి కృపవలన ఉపాసకులకు నిశ్చలమగు దీక్ష, సర్వత్ర సిద్ధి, విజయము ప్రాప్తించును.
మీ అందరికీ జగ్న్మాత కటాక్షం పూస్ర్తిగా లభించాలని మనసారా కోరుకొంటున్నాను.
బ్రహ్మచారిణి( గాయత్రి )
శ్లో|| దధానా కరపద్మాభ్యాం అక్షమలాకమండలూ |
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||
రుచిర గర్భ సీసము. ( రుచిరము. - జ భ స జ గ .. యతి 9)
శ్రీమాతవు పరాత్పరీ కను నను బ్రహ్మ - చారిణీ! భక్తితో సంస్తుతింతు.
నిన్నే గనితరింతునేన్ మది నిను దాల్చి - భక్తితో నిరతంబు భజన చేతు.
ప్రార్థింతునునిరంతరంబసదృశ నిశ్చ- లాత్మతో నిన్నెంచి యజ్ఞ రూప.
నీరూపునె స్మరింతు నిన్ ననుఁగను మాతృ - దేవతా! వరమీగదే శివాని.
దివ్య నవరాత్రిలోనిద్వితీయ మూర్తి
బ్రహ్మచారిణివైమమ్ము బ్రతుకఁ జేయ
మమ్ము కరుణించి వచ్చితే కమల నయన!
వందనంబులు చేకొమ్ము పావనాఘ్రి!
సీస గర్భస్థ రుచిరవృత్తము. ( రుచిరము. - జ భ స జ గ .. యతి 9)
పరాత్పరీ కను నను బ్రహ్మచారిణీ!
తరింతునేన్ మది నిను దాల్చి భక్తితో
నిరంతరంబసదృశ నిశ్చలాత్మతో

స్మరింతు నిన్ ననుఁ గను మాతృ దేవతా!
నైవేద్యం :  పులిహోర
 జైహింద్.