గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, ఏప్రిల్ 2024, శనివారం

శ్రీ శశి శర్మ బొల్లాప్రగడ గారి అష్టావధానం.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

సౌందర్యలహరిలోని ప్రతి శ్లోకం యొక్క శక్తి

0 comments

జైశ్రీరామ్. 

సౌందర్యలహరిలోని ప్రతి శ్లోకం యొక్క శక్తి 

1. ప్రతి రంగంలో గెలుపు
2. ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించడం
3. సమస్త జ్ఞానాన్ని పొందడం
4. అన్ని భయాలను తొలగించడం, వ్యాధుల నివారణ
5. స్త్రీ పురుషుల మధ్య పరస్పర ఆకర్షణ
6. సంతానంగా పుత్రులను పొందడం
7. అమ్మవారిని ప్రత్యక్షంగా చూడడం, శత్రువులపై విజయం సాధించడం
8. జనన మరణాలను నివారించడం
9. యాత్రకు వెళ్లిన వ్యక్తులు తిరిగి రావడానికి, ఎనిమిది రకాల సంపదలను పొందేందుకు
10. దృఢమైన శరీరం, పురుషత్వము పొందడం
11. మంచి సంతానం, జీవితానికి అర్థాన్ని పొందడం
12. శివుని పొందుటకు,
13. మూగవాడిని మాట్లాడేలా చేయడం
14. ప్రేమ విషయాలలో విజయం
15. కరువు, దోపిడీ మరియు అంటువ్యాధిని నివారించడం
16. పద్యాలు వ్రాయగల సామర్థ్యం మరియు పండితుడు అయ్యే సామర్థ్యం
17. వేదాలలో పాండిత్యం, పదాలపై పట్టు, శాస్త్ర పరిజ్ఞానం
18. ప్రేమలో విజయం
19. ప్రేమలో విజయం
20. అన్ని విషాలను నయం చేయడం మరియు అన్ని జ్వరాలను నయం చేయడం
21. ప్రతి ఒక్కరినీ ఆకర్షించడం, అందరినీ సంతోషపెట్టడం
22. అన్ని అధికారాలను పొందడం,
23. సమస్త సంపదలను పొందడం
24. భూతాలు, ప్రేతాలు మరియు పిశాచాల భయం నిర్వహణ
25. ఉన్నత పదవులు మరియు అధికారాన్ని పొందడం
26. శత్రువుల నాశనము
27. స్వీయ మరియు అంతిమ సత్యాన్ని గ్రహించడం
28. విష భయం, అకాల మరణం
29. అబార్షన్లను నివారించడం, చెడు వ్యక్తులను మచ్చిక చేసుకోవడం
30. మరొక శరీరంలోకి ప్రవేశించడం
31. ప్రతిదానికీ ఆకర్షణ,
32. దీర్ఘాయువు, ప్రతిదానిని ఆకర్షించడం
33. అన్ని ప్రయోజనాలు
34. పరస్పర ఇష్టం అభివృద్ధి
35. క్షయవ్యాధిని నయం చేయడం
36. అన్ని వ్యాధులను నయం చేయడం
37. భూత, ప్రేత పిశాచ మరియు బ్రహ్మ రాక్షసాలను తొలగించడం
38. బాల్యంలో అనారోగ్యం నయం
39. మనం ఏమనుకుంటున్నామో కలలో చూడడానికి
40. లక్ష్మి నుండి దీవెనలు, మంచి కలలు కనడం, చెడు కలలు చూడకపోవడం
41. అమ్మవారి ప్రత్యక్ష దర్శనం, లైంగిక వ్యాధులు నయం
42. సమస్తమును ఆకర్షింపజేయుట, నీటి వలన రోగములను నయం చేయుట
43. అందరిపై విజయం
44. అన్ని వ్యాధులను నయం చేయడం
45. సంపద దేవత యొక్క ఆశీర్వాదం, మీ మాట వాస్తవం అవుతుంది
46. ​​కొడుకుతో ఆశీర్వాదం పొందడం
47. అన్ని ప్రయత్నాలలో విజయం
48. తొమ్మిది గ్రహాల వల్ల ఏర్పడే సమస్యల తొలగింపు
49. ప్రతిదానిలో విజయం, సంపదలను గుర్తించడం
50. దూరం చూడటం, స్మాల్‌ పాక్స్ నయం
51. ప్రజలందరినీ ఆకర్షించడం
52. ప్రేమలో విజయం, చెవులు మరియు కంటి వ్యాధులను నయం చేయడం
53. సమస్త ప్రపంచాన్ని ఆకర్షించడం, దేవతను ప్రత్యక్షంగా చూడటం
54. సర్వపాపనాశనము., నేత్రవ్యాధుల నివారణ
55. రక్షించే శక్తి, మూత్రపిండాల వ్యాధులను నయం చేయడం
56. కారాగారం నుండి విముక్తి పొందడానికి, కంటి వ్యాధులను నయం చేయడం
57. సంపూర్ణ అదృష్టం
58. అన్ని వ్యాధుల నుండి నివారణ, ప్రేమలో విజయం
59. ప్రతి ఒక్కరినీ ఆకర్షించడం
60. మూగవారికి వాక్ శక్తిని ఇవ్వడం, మీ అంచనాలను నిజం చేయడం
61. మనస్సుపై విజయం, సంపద పొందడం
62. మంచి నిద్ర
63. అందరినీ మంత్రముగ్ధులను చేయడం
64. సమస్త జ్ఞానాన్ని పొందడం
65. విజయం, పదాలపై నియంత్రణ
66. మధురమైన మాటలు, సంగీతంలో పాండిత్యం
67. దేవత యొక్క వ్యక్తిగా కనిపించడం
68. రాజును ఆకర్షించడం
69. సంగీతం మీద పాండిత్యం
70. శివుడు చేసిన తప్పులకు పరిహారం
71. సంపద పొందడం
72. అంధకార భయాన్ని జయించడం, అమ్మవారి అనుగ్రహం పొందడం, యక్షిణికి దాసుడు చేయడం
73. పాల ఉత్పత్తి, విముక్తి
74. మంచి కీర్తి
75. పద్యాలు వ్రాయగల సామర్థ్యం
76. పూర్తి పరిత్యాగం, ప్రేమలో విజయం
77. సూక్ష్మ దృష్టిని పొందడం, ప్రతి ఒక్కరినీ ఆకర్షించడం
78. సమస్త విశ్వాన్ని ఆకర్షించడం
79. మాంత్రిక సామర్థ్యాన్ని పొందడం, ఇతరులందరినీ మంత్రముగ్ధులను చేయడం
80. విశేషమైన అందాన్ని పొందడం, ఇంద్రజాలంలో నిపుణుడు అవ్వడం
81. అగ్నిని ఆపడం
82. వరదను ఆపడం, ఇంద్రుడు వంటి అధికారాలను పొందడం
83. సైన్యాన్ని ఆపడం
84. విముక్తి పొందడం, మరొక శరీరంలోకి ప్రవేశించడం
85. దయ్యాల భయాన్ని తొలగించడం
86. దయ్యాల భయాన్ని తొలగించడం, శత్రువులపై విజయం
87. పాములను ఆకర్షించడం
88. క్రూరమృగాలు పాటించేలా చేయడం
89. అన్ని రోగాల నుండి విముక్తి పొందడం
90. చెడ్డ మంత్రాలను కత్తిరించడం
91. భూమి పొందడం, సంపదలు పొందడం
92. పాలించే సామర్థ్యాన్ని పొందడం
93. కోరికల నెరవేర్పు
94. అన్ని కోరికలను పొందడం
95. అన్ని కోరికలను పొందడం
96. జ్ఞానం మరియు సంపద సాధించడం
97. ఆత్మ యొక్క విముక్తి
98. మాటలపై పట్టు
99. పరమానందాన్ని పొందడం
100. సకల క్షుద్ర శక్తి ప్రాప్తి
జైహింద్.


సర్వః సర్వం న జానాతి .. మేలిమి బంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  సర్వః సర్వం న జానాతి  -  సర్వజ్ఞో నాస్తి కశ్చన |

నైకత్ర పరినిష్ఠాస్తి  -  జ్ఞానస్య పురుషే క్వచిత్ ||

తే.గీ.  అందరన్నియునెఱుఁగ రీ యఖిల జగతి,  

కనగ సర్వజ్ఞులుండరు కద ధరిత్రి, 

యెక్కడైనను పరికింప నొక్క పురుషు

నందె సుజ్ఞానముండ దహంబు తగదు.

భావము.  అందరూ అన్నింటినీ తెలుసుకొనివుండరు. ఎవరూ సర్వజ్ఞుడు కాడు. ఎక్కడా ఒక మనిషిలోనే జ్ఞానంయొక్క పరిపూర్ణమైన నిష్ఠ ఉండదు.

జైహింద్.

19, ఏప్రిల్ 2024, శుక్రవారం

యథా ప్రదీప్తః పురతః ప్రదీపః .. మేలిమి బంగారం మన సంస్కృతి.

0 comments

జైశ్రీరామ్ 

శ్లో. యథా ప్రదీప్తః పురతః ప్రదీపః  -  ప్రకాశమన్యస్య కరోతి దీప్యన్।

తధేహ పంచేంద్రియదీపవృక్షాః  -  జ్ఞానప్రదీప్తాఃపరవంత ఏవ॥

తే.గీ.  వెలుగఁ జేసిన దీపంబు వెలుగుచుండి,

వెలుగఁ జేయునన్యములను వెలుతురిచ్చి,

దేహవృక్షమింద్రియములన్ దీప్తమగుచు

దీప్తి గొలుపు నన్యులకును, ధీప్రదమయి.

భావము. వెలిగించిన దీపం తాను ప్రకాశిస్తూ, తన సమీపాన గల 

ఇతర వస్తువులను కూడా ప్రకాశింప జేసినట్లు శరీరమనే వృక్షంలోనున్న 

పంచేంద్రియాలు జ్ఞానంతో తాము ప్రకాశిస్తూ, ఇతరులను కూడా ప్రకాశింపజేస్తాయి.

జైహింద్.

బాల్యం లోనే బ్రహ్మజ్ఞానం II ఈ పిల్లల తల్లితండ్రుల పూర్వ జన్మ సుకృతం ... దర్శనం శర్మగారు.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

న శ్రేయః సతతం తేజో .. మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  న శ్రేయః సతతం తేజో  -  న నిత్యం శ్రేయసీ క్షమా |

తస్మాన్నాత్యుత్సఽజేత్ తేజో  -  న చ నిత్యం మృదుర్భవేత్ || (హితోపదేశం)

తే.గీ.  కోపమొప్పదు సతతంబు,  గుణనిధాన!

క్షమయు సతతంబు తగదయ్య! గౌరవాఢ్య!

నీ పరాక్రమమనయంబు చూపబోకు,

నీ మృదుత్వమున్ చూపకు నిత్యమిలను.   

భావము.  ఎల్లపుడూ శౌర్యంతో కోపగించుకోవడం శ్రేయస్కరం కాదు. ఎన్నెన్నటికీ క్షమాశీలతతో ఉండటమూ అంత  శ్రేయస్కరం కాదు. అందువలన ఎల్లపుడూ పరాక్రమాన్ని ప్రదర్శించడమూ, మృదువుగా ఉండటమూ మంచిది కాదు.

జైహింద్.

18, ఏప్రిల్ 2024, గురువారం

పుష్పమాలికాబంధ స్రగ్ధర. రామౌక్తం.

0 comments

 

జైహింద్.
జైహింద్.

కవితాసుందరి కావ్యము నుండి పది పద్యములు. .. డా. నలవోలు నరసింహా రెడ్డి

0 comments

జైశ్రీరామ్. 

 కవితాసుందరి కావ్యము  

కం. శ్రీకర మా, వాణీ, గిరి 

జా కర సంపూర్ణ కరుణ జలజాకరమై 

సాకర 'కావ్యమునకు' సమ

తాకర శుభకర మిడుత! సుధాకర కరమై 1


సీ.నిండు పున్నమిరేయి పండు వెన్నెలవోలె

        మధుపమ్ము గొనితెచ్చు మధువువోలె

పంట చేనుల నూగుపసిడి కంకులవోలె

         మింట విద్యుల్లతమెరుపువోలె

పచ్చ కర్పూరంపు పరిమళంబులవోలె

        ఆటాడుహరిదాసు పాటవోలె

తల్లి గుండెలపైనతనరు పాపలవోలె

        పసిబిడ్డనును వేడి స్పర్శవోలె

గీ. ముద్దు ముద్దుగ తెలవారు పొద్దువోలె

పల్లెకోవెల యందలి పాటవోలె

సాహితీ ప్రియుల్‌ తలలూచి చప్పటులను

జరచుచుండ కవిత్వంబు సాగవయు   2


సీ. మల్లె పూవులు బూచి మరులుగొల్పెడు రీతి

             చల్లనౌ ముత్యాలజల్లు రీతి

మధు మాసమున బూయు మావి తావుల రీతి

             తీయతీయని జుంటి తేనె రీతి

చిన్ని పాపల నోట చిలుక పల్కుల రీతి

              జున్ను మీగడ పాల వెన్న రీతి

మోహంపు ప్రియురాలు ముద్దు వడ్డన రీతి

              షడ్రసోపేత భోజనము రీతి

గీ. పాలుత్రాగిన దూడల పరుగు రీతి

లేడి కూనలు చెంగున నాడు రీతి

మధుర మంజుల సాహిత్య సుధలు జిందు

కవిత వ్రాయగా వలె నిల కవివరుండు 3


సీ. మండు వేసవిలోన మధురపానీయంబు 

            తనివితీరెడు రీతి త్రాగు నట్లు 

చిరు జల్లువెనువెంట గురియు చుండగ వేడి

            మిరుప బజ్జీలను కొరికినట్లు

సరసంపు రాత్రిలో చిరు హెచ్చరింపుగా

            తొలి కోడికూతయై దోచునట్లు

నల్లమబ్బులజూచి మెల్లగాపురి విప్పి

            హాయి గొల్పగ నెమళ్ళాడునట్లు

ఆ. కొండ కోన లోన కోకిలమ్మల పాట

గాలి తెరల పైన తేలినట్లు

రసిక జనులుమెచ్చి మిసమిస లొలకించు

కవితవ్రాయ వలయు కవివరుండు 4


సి. రాగసుధలు జింద రసమయ జగతికి 

              రాణించు మాణిక్య వీణయగుచు 

రమ్య గీతిక భంగి రంజిల్లు రాగాల

            పల్లవించుచునుండి నుల్లమలర 

మెదడు నిద్దురబాపి మేలుకొల్పగ జేసి  

            నవ్యమార్గములందు నడుపుచుండి 

నవనవోన్మేషపుం నాట్యమయూరమై 

           తకధింత తద్ధింత తాళ గతుల 

గీ. నర్తనము సల్పి మనుజాళి నాల్కలందు 

 గుండె గుండెను కదుపుచు క్రొత్తదనము 

కలిగి జనులలో  చైతన్య కాంతి నింపి  

అలరు నట్టిదే యగునచ్చమైన కవిత 5


సీ. కవన నిర్మాణమ్ము గావింప వలెనన్న 

         నరుదైన అంశమ్ము నరయవలయు 

అరయబూనిన కైత అద్భుతంబగురీతి  

          చెన్నుమీరెడుభంగి జెప్పవలయు

చెప్పబూనిన కైత చిత్తమ్ము లలరించ 

          కొమరారు పదములం దమర వలయు   

అమర బూనిన కైత పరమార్ధమును దెల్పు     

           భావపుష్టి గలిగి పరగ వలయు 

ఆ. పరగి నట్టి కైత పండితాళురు మెచ్చ 

ఆటవెలది యగుచు నాడవలయు 

కవన మిట్టులున్న కలకాలమందున 

కవికి గలుగు నిల నఖండకీర్తి 6


సీ. మధుమాస మరుదెంచి మంగళారతి నెత్త 

            శుకపిక రవమ్ముల శోభలట్లు 

 కమనీయ మైన ఉగాది పచ్చడి లోని 

             కొత్తనౌ రుచు లారు గ్రోలునట్లు 

పచ్చచీరను గట్టి ప్రకృతి కాంత యిలపై  

             పొలుపైన సొగసార బోసినట్లు 

పాల్గారు చెక్కిళ్ళ పసిపాప మోవిపై 

            చిరునవ్వు నింపార జిందునట్లు 

గీ. నందనారామ సీమలానందముగను 

నేత్రపర్వమై పులకించు యాత్ర సలిపి 

చిత్త మందున సంతృప్తి జెందునట్లు

కవిత కూర్చగా వలె కలకండ యట్లు   7


సీ. కొత్త పాతలలోని కుదురు సాహిత్యమ్ము  

           నెలవైన బుద్ధితో నేర్చి నేర్చి

సరసమై వెల్గొందు శబ్దపల్లవముల 

           క్రొమ్మెరుంగులు జింద  గూర్చి కూర్చి

ఇటుక వామును దెచ్చి యిల్లు గట్టినయట్లు  

           పేరైన పదములం బేర్చి పేర్చి 

అతివ మేనికి సొమ్ము లందగించిన రీతి

           తెలి యలంకారముల్  తీర్చి తీర్చి    

గీ.  సరళ సుందర సన్మార్గ శైలినొప్పి  

మనసు నాకట్టుకొనునట్లు మార్చి మార్చి  

సొబగు లీనుచు సర్వాంగ సుందరముగ 

కవిత లల్లగావలె నిల కవి వరుండు.  8


సీ. కాలి యందెలు ఘల్లు ఘల్లంచుప్రభవింప

          కుటిల కుంతల యౌచు కులుక వలయు

కులుకగా సరిపోదు .. గుండె గుండెనుమీటి

           మోహన రాగమై మ్రోగవలయు

మ్రోగగా సరిపోదు..మూర్ఖత్వమును బాప

           పంచ కల్యాణియై బరగ వలయు

బరగగా సరిపోదు..స్వార్థభూతము నుండి

           మనిషినిమనిషిగా మార్చవలయు

గీ. మార్చగా సరిపోదు..సమాదరించి

మొలక నవ్వులు మోవిపై మొలువ జేసి

మంజు కావ్యమై రసరమ్య రంజితముగ

కవిత సాగగా వలయు నే కాలమైన  9


సీ. మధుర నిష్యందమై మకరంద బిందువై  

            సిరులొల్కు సింధువై చెలగు భంగి

 కనగా విచిత్రమై వినసొంపు గాత్రమై   

            దరిజూపు నేత్రమై తనరు భంగి 

సిరిమల్లె తావియై విరబూచు మావియై 

            జలతారు కావియై యలరు భంగి  

జగతిలో సత్యమై సరములో ముత్యమై  

            హృదయాల నిత్యమై యెసఁగు భంగి 

గీ.  త్రాగ మధురంపు నీరమై తనరు భంగి 

చదువ భావగంభీరమై యొదవు భంగి 

కవుల కాధారమై నిల్చు కావ్య మటులు 

కవిత లల్లగా వలయు సత్కవులు సతము  10


డాంఅలవోలు నరసింహారెడ్డి గారి కవిత ద్రాక్షాపాకం. కవులకు మార్గదర్శక

 పద్యదశకమిది.

కవికి నా అభ్గినందనపూర్వక ధన్యవాదములు.

జైహింద్.